శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలు అన్ని రకాల సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మియాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి.శివప్రసాద్ హెచ్చరించారు. సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా మియాపూర్‌లోని వర్టెక్స్ జూనియర్ కాలేజీలో పైసా పైలం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కళాశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు రకాల సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఇన్వెస్ట్మెంట్ మోసాలు, స్టాక్స్, టాస్క్ ఆధారిత మోసాలు, లోన్ యాప్స్, లోన్ ఫ్రాడ్స్, గిఫ్ట్ ఫ్రాడ్స్, అడ్వర్టయిజ్మెంట్ ఫ్రాడ్స్, రివార్డు పాయింట్ల మోసాలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహనను కలిగి ఉండాలని, అప్పుడే నేరాలను నియంత్రించడం వీలవుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఓటీపీలు, పాస్వర్డ్లు, ఇతర బ్యాంకింగ్ సమాచారాన్ని అపరిచిత వ్యక్తులకు చెప్పకూడదని అన్నారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇందుకు గాను 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా www.cybercrime.gov.in అనే వెబ్సైట్లో సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి.రమేష్ నాయుడు, సైబర్ వారియర్ కె.సూర్య తేజ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






