కార్మిక చ‌ట్టం నాలుగు లేబర్ కోడ్ ల అమలును రద్దు చేయాలి: కర్రదానయ్య

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కార్మిక సంఘాలు, ఎస్ కే ఎమ్ ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మియాపూర్ లో ఎఇసిటియు ధర్నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ ధర్నా సందర్భంగా సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్ర దానయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి 29 చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చింది. ఈ కోడ్ల వల్ల కార్మికులు యాజమాన్యాల ముందు బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కోడ్ లలో 12 గంటల పని విధానం ఉంది. దీని వల్ల 8 గంటల పని విధానం రద్దు అయ్యే అవకాశం ఉంది. చట్టబద్ధంగా సమ్మె చేసే హక్కు లేదని తెలిపారు. కాలపరిమితితో కూడుకున్న ఉద్యోగ నియామకాల అంశం ఉందని, పర్మినెంట్ ఉద్యోగాలు లేకుండా కాల పరిమితితో కూడిన ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఉద్యోగ కాలాన్ని నిర్ణయించే అధికారం యాజమాన్యాలకు కల్పించటం సరైంది కాదని అన్నారు. యాజమాన్యం యూనియన్ ను గుర్తించాలంటే కంపెనీలో పని చేస్తున్న కార్మికుల్లో 52 శాతం సంతకాలు పెడితేనే యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుందని కోడ్లో పొందుపరిచారన్నారు. ఈ నిబంధనతో ఒక్క కంపెనీలో ఒక్క యూనియన్ గుర్తింపు పొందే అవకాశం లేదన్నారు. దీని ద్వారా యూనియన్ పెట్టుకునే అవకాశం లేకుండా చేశారని అన్నారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించటానికి ఒక సంక్షేమ కమిటీ వేస్తామని, ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉండాల్సిన వ్యక్తిని యాజమాన్యం నియమిస్తుందని కోడ్లలో పొందుపరచడం దుర్మార్గం అని అన్నారు.

గతంలో వ్యాపార సంస్థల్లో కార్మికుల సంక్షేమం, జీతభత్యాలు సక్రమంగా చెల్లిస్తున్నారా? లేదా? అనే అంశాలపై లేబర్ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారని, కార్మికుల సమస్యలను వారికి విన్నవించుకునేవారు కానీ ఇప్పుడు వారిని ఫెసిలిటేటర్ కమ్ ఇన్‌స్పెక్టర్గా పేరుమార్చి వారికున్న అధికారాలు కత్తిరించారని విమర్శించారు. కోడ్ లలో మహిళలకు రాత్రిపూట డ్యూటీ చేసుకునే అవకాశం కల్పించామని కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్నదని, గత చట్టాల్లో ఉన్న కొన్ని అంశాలను కోడ్లలో పొందుపరిచామని చెప్తున్నారని, వీటిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. గత చట్టాల్లో ఉన్న సామాజిక భద్రతను తగ్గించారని తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో చాప్టర్ 5బీలో 100 మంది కంటే ఎక్కువ కార్మికులున్న పరిశ్రమను మూసి వేయాలన్నా, కార్మికుల్ని తొలగించాలన్నా, లే ఆఫ్ ఇవ్వాలన్నా, ఆ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిబంధన ఉండేది, కానీ ఈ సంఖ్యను 100 నుంచి 300లకు పెంచుకునే అవకాశాన్ని యాజమాన్యాలకే కట్టబెట్టారని అన్నారు. కోర్టుకు పోయే హక్కును సైతం తొలగించి ఇద్దరు సభ్యుల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు.

ఈ అంశాల వల్ల కార్మికుల హక్కులు పరిష్కారం కావటానికి చాలా సమయం పడుతుందని, యూనియన్లు భవిష్యత్తులో ఉండే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ ఉనికిలో లేకుంటే కార్మికులు స్వతంత్రంగా పోరాటం చేయలేరని తెలిపారు. యూనియనే లేకుండా చేస్తే యాజమాన్యాలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చునని కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో యూనియన్లు లేకుండా చేయడం వల్ల కార్మికులు పడుతున్న అష్ట కష్టాలను చూస్తుంటే మనకు అర్థమవుతున్నద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బి నారాయణ, వై.రాంబాబు , కె.రాజు, శివాణి, అనిల్ కుమార్, వెంకటేశ్వరరావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here