శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్‌పేట డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని నియోజకవర్గం బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి కోరారు. తమ ప్రభుత్వ హయాంలో హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో మూడు చోట్ల అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించడం జరిగిందన్నారు. ఆల్విన్ కాలనీ చౌరస్తా, దీప్తి శ్రీనగర్, మై హోమ్ వద్ద ఒక్కో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ సరిగ్గా లేక చెత్త, వ్యర్థాలకు ఆవాసాలుగా మారాయన్నారు. రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల వృద్ధులు, మహిళలు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించుకోలేకపోతున్నారని అన్నారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, లిఫ్టుల సౌకర్యం కూడా సరిగ్గా లేదని అన్నారు. వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు మరమ్మత్తులు చేపట్టి వాటి నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని, ప్రజలు వాటిని వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.






