శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలోని జలమండలి కార్యాలయంలో డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై జలమండలి DGM నారాయణ, మేనేజర్ సునీతతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లిప్తతను వీడాలని, తమ దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇంజనీరింగ్, జలమండలి, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, రోడ్డు కట్టింగ్ సమయంలో మంచి నీటి పైప్ లైన్ , డ్రైనేజి పైప్ లైన్ వేసేటప్పుడు తవ్విన రోడ్లను వెంటనే మరమత్తులు చేయాలని అన్నారు. UGD, రోడ్లు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మంచి నీటి సరఫరా వ్యవస్థను సరిగ్గా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






