శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్ 12, 14, 16, 17, 18, 23 కేంద్రాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి బూత్ వద్ద పోలింగ్ శాంతియుతంగా జరుగుతున్న విధానాన్ని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించడం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగినప్పటికీ, ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిస్పాక్షికంగా ఓటు వేయాలని, ఇది ప్రజాస్వామ్య బలాన్ని పెంచుతుందని అన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి పౌరుడి గౌరవ చిహ్నమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించాలని గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అందరూ చురుకుగా పాల్గొని అధిక శాతం పోలింగ్ నమోదు చేయాలని ఆయన ఆకాంక్షించారు.





