బిసి మేథావుల మ‌ద్ధతు కోరిన కాంగ్రెస్ పార్టీ

  • జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని వినతి

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కు మద్దతునివ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్ డీడీ కాలనీలోని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ కార్యాలయానికి వచ్చి బీసీ మేథావులు, బీసీ సంఘాల నేతల మద్దతు కోరారు .కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధుల బృందంగా పార్టీ తరపున హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరపత్రి అనిల్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వినయ్ కుమార్ మద్దతు కోరిన వారిలో ఉన్నారు . బీసీ ఇంటలెక్చువల్ ఫోరం , బిసి పొలిటికల్ ఫ్రంట్ నేత‌ చిరంజీవులు , బిసి పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ టి చిరంజీవులు మాట్లాడుతూ కేంద్రానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధాన మంత్రితో సంప్రదింపులు జరిపి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని కోరారు.

వచ్చే శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఈ సందర్భంగా విమర్శించారు. బీసీ వాదాన్ని బలపరచడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్ కు తాము మద్దతులిస్తున్నట్లు వారు ప్రకటించారు . బీసీలను మూడు పార్టీలు మోసం చేస్తున్నాయని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారి ప్రతినిధులకు సూచించారు. బీసీ వృత్తి కులాలకు సంబంధించి బడ్జెట్ ను విడుదల చేసేందుకు ఒత్తిడి తేవాలని కోరారు. బిసి ఇంటలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు చెప్పిన పలు డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు కోసం బీసీ నేతలంతా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు.

ఈ చర్చల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎస్ దుర్గయ్య గౌడ్ , అంబాల నారాయణ గౌడ్ , యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు చాపకూర రాజు , కెవి గౌడ్ , ఎర్రమాద వెంకన్న , రాపోలు జ్ఞానేశ్వర్ , ఒంటెద్దు నరేందర్ , అవ్వారు వేణు , గోర శ్యాంసుందర్, భైర శేఖర్ , లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here