- డీపీఓగా ఎంపికైన ఇంజినీరింగ్, న్యాయశాస్త్ర పట్టభద్రురాలు బొప్పన అనూష
- ఎల్ఎల్బీలో రెండు స్వర్ణ పతకాలు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఖమ్మం యువతి బొప్పన అనూష పట్టుదలతో చదివి గ్రూప్ 1 సర్వీసులో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పదవిని సాధించి రాష్ట్రానికి వన్నె తెచ్చారు. తాజాగా వెలువడిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-1 ఫలితాల్లో ఆమె ఈ అద్భుత విజయాన్ని సాధించారు. బొప్పన అనూష పట్టుదలకు ప్రతిభ తోడై ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 112వ ర్యాంకు, మల్టీ జోన్-1 పరిధిలో 62వ ర్యాంకు సాధించి డీపీఓగా ఎంపికయ్యారు. ఈ విజయం ఆమె కఠోర శ్రమకు, అంకితభావానికి నిదర్శనం. అనూష బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ (న్యాయశాస్త్రం) అభ్యసించి, అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. అందులో ఆమె ఏకంగా రెండు స్వర్ణ పతకాలను (గోల్డ్ మెడల్స్) అందుకున్నారు. ఈ విజయాల స్ఫూర్తితోనే గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే ఉన్నత ర్యాంకు సాధించారు. సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు అంకితభావంతో చదివిన అనూష విజయంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలోని గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీ అంజనాద్రి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న అనూష తల్లిదండ్రులు బొప్పన చంద్రశేఖర్ రావు, బొప్పన పద్మావతి, ఆమె భర్త ఎం. సంతోష్‌లు తమ సంతోషాన్ని పంచుకున్నారు.






