శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగ నేపథ్యంలో రహదారులపై ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చూసేందుకు గాను ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్లు సహకరించాలని మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ కోరారు. ఆయా వాహనాల డ్రైవర్లతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులతో రహదారులపై ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో అన్ని వాహనాలకు చెందిన డ్రైవర్లు ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చూడాలన్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కిన వెంటనే వాహనాన్ని అక్కడి నుంచి కదిలించాలని, బస్సు డ్రైవర్లు ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించి వాహనాన్ని నడపరాదని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే బస్సులను పార్కింగ్ చేయాలని, బస్సులను ఒకదాని వెనుక ఒకటి నిలపాలని, ఒకదాని పక్కన ఒకటి నిలపకూడదని, ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులకు గాను ట్రాఫిక్ రద్దీ ఉన్న చోట కాకుండా ట్రాఫిక్ రద్దీ లేని చోట పికప్, డ్రాప్ పాయింట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వీరన్న, ఏసీపీ వెంకటయ్య, ఇతర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, అన్ని వాహనాలకు చెందిన డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు.






