శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ఏరులై పారుతున్న మద్యాన్ని అరికట్టి బెల్ట్ షాపులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామకృష్ణ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక్కొక్క బస్తీలో అనేక బెల్ట్ షాపులు ఉన్నాయని, 24 గంటలు ఓపెన్ ఉంటున్నాయని, కానీ మెడికల్ షాపులను మాత్రం టైముకు ఓపెన్ చేయడం లేదన్నారు. ప్రాణాలను కాపాడే మెడికల్ షాపులకు టైమింగ్ పాటిస్తున్నారని, జీవితాలను నాశనం చేసే బెల్టు షాపులు 24 గంటలు ఓపెన్ ఉంటున్నాయని అన్నారు. దీంతోపాటు డ్రగ్స్, గంజాయి వల్ల యువత చెడిపోతున్నారని అన్నారు. బస్తీల్లో బెల్ట్ షాపుల వల్ల మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. యువత చెడు దారి పట్టేందుకు ఈ మద్యం షాపులు కారణమని అన్నారు. శేరిలింగంపల్లిని డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కె చందు యాదవ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు తుపాకుల రాములు, ఎస్ సురేష్, మియాపూర్ కార్యదర్శి సురేఖ, బి నారాయణ, వెంకట్, కార్యదర్శులు చంద్రమ్మ, కృష్ణ పాల్గొన్నారు.






