శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఓంకార్ భవన్ బాగ్ లింగంపల్లి హైదరాబాద్ నుండి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పల్లె మురళి, గడ్డం నాగార్జున ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పల్లె మురళి, గడ్డం నాగార్జున మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ 1 పరీక్ష నిర్వహించిన అనేక సెంటర్లలో అక్రమాలు జరిగినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అందరు అభ్యర్థులకు 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోఠి ఉమెన్స్ కాలేజీలో మహిళ అభ్యర్థులకి ప్రతేకంగా రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారని, మిగిలిన 26 సెంటర్లలో 139 మంది ఎంపికయ్యారని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 563 ఉద్యోగాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్లు టీజీపీఎస్సీ సీల్డ్ కవర్లో పేర్కొందని తెలిపారు. ఇంగ్లీష్ లో 12,381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యారని, తెలుగులో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారని, దీనివల్ల తెలుగు మీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అభ్యర్థులు రీ కౌంటింగ్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు మార్కులు తగ్గాయని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో పబ్లిక్ కమిషన్ చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.
2 హాల్ టికెట్స్ గతంలో 2011 ఇచ్చామని హైకోర్ట్ కి తెలిపిన కమిషన్ ఆ రోజు సమైక్య రాష్ట్రంలో నాటి కమిషన్ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని నాడు పోరాడామని, ఇప్పుడున్న కమిషన్ అదే విధానాన్ని అనుసరించటం వల్ల గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం పోరాడుతున్నామని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా హైకోర్ట్ డివిజన్ బెంచికి, సుప్రీంకోర్టు కి వెళ్లవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.





