శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరారు. శేరలింగంపల్లి నియోజకవర్గం ఇజ్జత్ నగర్ లోని సిపిఐ కార్యాలయంలో కె.సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో జంగయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈనెల 11 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శేరిలింగంపల్లిలో వివిధ బస్తీలలో నెలకొన్న ప్రజా మౌలిక సమస్యలను పాలకులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే వారికి రెవెన్యూ అధికారులు, పాలకులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంచేలా భూ పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు,కె రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభు లింగం, రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు కే చందు యాదవ్, టి వరలక్ష్మి, తుపాకుల రాములు, సురేష్, ఎస్ కొండలయ్య, బి నారాయణ, ఎం వెంకటేష్, చంద్రమ్మ, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.






