శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి రక్షించాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు శేరిలింగంపల్లి సీపీఎం కార్యదర్శి చల్లా శోభన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 అని చెబుతూ ఆ భూమిని కబ్జా చేస్తున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి మండల సర్వేయర్, హెచ్ఎండీఏ సర్వేయర్లు ఆ భూమిని సర్వే చేశారని, దాన్ని ప్రభుత్వ భూమి అని నిర్దారించిన తరువాత కూడా కబ్జా ఆగలేదని అన్నారు. ఆ స్థలంలో అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారని అన్నారు. అందులో కొందరు ప్రజలు తెలియక ప్లాట్స్‌ను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరారు.





