శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షుడు, ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ , కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ నారాయణరావును తెలుగు తేజం అవార్డు వరించింది. శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా తెలుగు భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని నరసారావు పేటరోని భువన చంద్ర టౌన్ ఆడిటోరియంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ సంబరాలలో భాగంగా ప్రముఖ కవి, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోటూరి నారాయణరావుకు తెలుగు తేజం పురస్కారాన్ని అందించారు. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు సాహిత్యం,కళల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వివిధ సాహితీ సంస్ధల ప్రతినిధులకు, కవులకు, సాహితీ వేత్తలకు ఈ అవార్డులను అందించారు. శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, నరసరావుపేట పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పింగళి వెంకయ్య మనుమడు జీవీఎస్ నరసింహులు, శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో కవి సార్వభౌముడు శ్రీనాధుడు ముని మనుమడు కావూరి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మోటూరి నారాయణరావు మాట్లాడుతూ దశాబ్దకాలంగా ఎస్ వీ ఫౌండేషన్, తెలుగు వెలుగు సాహిత్య వేదిక ద్వారా పలు సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న నేపధ్యంలో శ్రీ శ్రీ కళా వేదిక వారు తెలుగు తేజం పురస్కారం అందించటం సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చమత్కార కవి కేఎల్ కామేశ్వరరావు, కవులు మండికారి బాలాజీ, భోగెల ఉమాకవి, డబ్బీరు గోవిందరావు, బాలచందర్ సాదే, గుర్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






