శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ ఎన్‌క్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పార్క్ లను, రోడ్లను కొంత మంది ఆక్రమణ చేసి కబ్జాలకు పాల్పడుతున్నారు అని, వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జూబ్లీ ఎన్‌క్లేవ్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ HMDA హుడా అప్రూవ్డ్ లే ఔట్ అని, కాలనీలో ఉన్న మూడు పార్క్ లను, రోడ్లను కొందరు వ్యక్తులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని అన్నారు. పార్కులను సంరక్షించాలని హైడ్రా అధికారులకు, GHMC అధికారులకు విన్నవించుకున్నా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని కబ్జాదారుల నుండి పార్క్ లను సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జూబ్లీ ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న పార్క్ లు, రోడ్ల కబ్జా చేస్తున్నవారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని , కబ్జాదారుల నుండి పార్క్ లను సంరక్షిస్తామని , రోడ్లను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని , ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.






