శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ కులగణన చేపట్టాలని గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థులు చేపట్టిన సత్యాగ్రహ నిరాహార దీక్షకు జైబీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందుగానే బీసీల రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని, తరువాతే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లను అమలు చేయకుండా ఎన్నికలను నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి రామచందర్ యాదవ్ దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్, ప్రెసిడెంట్ శివ ముదిరాజ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోషియేషన్ జాతీయ అధ్యక్షుడు జి కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి వసుమతి యాదవ్, యూనివర్సిటీ ప్రెసిడెంట్ మల్లేష్, జనరల్ సెక్రటరీ శివ యాదవ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.