తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. సాధారణంగా ఎన్నికల సమయంలోనే ఇలాంటి వాతావరణం ఉంటుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. కానీ తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ప్రభుత్వం ప్యాక్ చైర్మన్‌గా పదవి ఇవ్వడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పదవిని ప్రతిపక్ష పార్టీల సభ్యుడికి ఇస్తారని, గాంధీ కాంగ్రెస్‌లో చేరారని, ఆయనకు ఆ పదవిని ఎలా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించింది.
అయితే ఎమ్మెల్యే గాంధీ మాత్రం తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి.. గాంధీకి పూలు, చీర పంపిస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. అయితే వివాదం అంతటితో సమసిపోలేదు. దీనికి తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదంపై స్పందించారు. ఇంతకీ అసలు ఆయన ఏమన్నారంటే..
బీఆర్ఎస్ పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బ దెబ్బ తీయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్‌తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లు వేయకపోతే గెలిచేవారా..? అని ప్రశ్నించారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.