శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రాంతీయ భేదాలు తీసుకువచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే కుట్ర చేస్తున్న ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై పోరాడాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఇలా చిల్లర రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన రూ.7లక్షల కోట్ల అప్పును తీరుస్తేనే రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వనికి సహరించాలి కానీ, సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడం చాలా సిగ్గు చేటు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడూ ఇలాంటి సంఘటలను చూడలేదని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ప్రాంతీయ భేదాలు తీసుకువచ్చి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సబబు కాదని, ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. అందరి సహకారంతోనే ప్రస్తుతం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుందని, మహిళలను అవమానిస్తూ, సంఘ విద్రోహ శక్తిగా మారుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని రెండు దఫాలుగా గెలిపిస్తే, తెలంగాణ ప్రజలను ఆగం చేసి దోచుకు తిన్నారని, మీ అహంకారాన్ని అణచివేయడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.
అధికారం పోతే ఇంత దిగిజరిపోవాలా, మీ ఓటమిని అంగీకరించకుండా ఇంకెన్నాళ్ళు ఈ నాటకాలు, ఇకనైనా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి, ప్రజలు ఏర్పరుచుకున్న ప్రజా ప్రభుత్వంపై బురద జల్లడం మానేసి, మీరు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని సూచించారు. ఏమేం తప్పులు చేశారో తెలుసుకుని సరిదిద్దుకోవాలి కానీ మీ తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఇలాంటి కారణాలు చెప్పి దుష్ప్రచారం చేయడం నిజంగా హాస్యాస్పదం అని అన్నారు. అహంభావంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.