శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే సమగ్ర కుల గణన చేపట్టాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర డిమాండ్ చేశారు. కుల గణనను మూడు నెలల్లో నిర్వహించి నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేయడాన్ని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, తెలంగాణ సగర సంగం రాష్ట్ర కమిటీగా స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతుల శ్రీనివాస్ గౌడ్ కృషి అభినందనీయమని శేఖర్ సగర అన్నారు. ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుకు లోనవుతున్న అనేక కులాల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాట మారుస్తూ కాలయాపన చేస్తూ బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటూ వదిలేస్తున్నారని ఆరోపించారు.
భవిష్యత్తులో ఇక బీసీలు రాజ్యాధికారం వైపు పయనించే రోజులు ఆసన్నమవుతున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ సగర డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలానుసారం రాష్ట్రంలో వెంటనే సమగ్ర కుల గణన చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా విధానాలను మార్చుకొని దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన చేపట్టి దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగించడానికి బీసీలంతా ఏకమవడం ఖాయమని అన్నారు.