- పూర్తయిన సుందరీకరణ, పునరుద్ధరణ పనులు
- ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో బక్షి కుంట చెరువు సుందరీకరణ, పునరుద్ధరణ పనులు ఫెనమ్ పీపుల్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టి పూర్తిచేశారు. ఈ సందర్భంగా చెరువును లేక్స్ కమిషనర్, ఐఏఎస్ అధికారి శివ కుమార్ నాయుడు కిల్లు, ఫెనామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ మహే బైరెడ్డి, ఫెనోమ్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ హరి బైరెడ్డి, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. బక్షి కుంట చెరువు దశ దిశ మారిందని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరిందన్నారు. మురికి కూపంలాంటి చెరువు ఫెనమ్ పీపుల్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ వల్ల స్వచ్ఛమైన మంచినీటి చెరువుగా మారనుందని తెలిపారు.
ఫెనామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మహే బైరెడ్డి మాట్లాడుతూ.. తాము వ్యాపార లక్ష్యాలను అధిగమించేలా శాశ్వత ప్రభావాన్ని చూపేందుకు ఫెనామ్లో ప్రయత్నిస్తున్నామని, సహజ వనరుల పరిరక్షణ కోసం తాము సేవలందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే బక్షికుంట సరస్సు పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపారు.
ఫెనామ్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ హరి బైరెడ్డి మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసమే బక్షికుంట సరస్సును పునరుద్ధరించడం జరిగిందన్నారు.
లేక్స్ అదనపు కమీషనర్, ఐఏఎస్ అధికారి శివ కుమార్ నాయుడు కిల్లు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తు తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు కృషిచేస్తున్నామని, అందులో ముఖ్యమైన అడుగు బక్షికుంట సరస్సు పునరుజ్జీవనమని పేర్కొన్నారు.
ఆనంద్ మల్లిగవాడ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యతగా “బక్షికుంట సరస్సు పునరుద్ధరణ‘‘ సూచిస్తుందని, ఫెనామ్ వంటి సంస్థల మద్దతుతో ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ ఐటీ సంస్థ ప్రతినిధులు రాము, చైతన్య, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాసరి గోపి, ఓ. వెంకటేష్, సందీప్, రఘుపతి, నరేందర్ బల్లా, దీక్షిత్ రెడ్డి, యశ్వంత్, వరలక్ష్మి, భవానీ, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.