నమస్తే శేరిలింగంపల్లి : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు పార్థీవ దేహానికి ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. రామోజీరావు నివాసానికి వెళ్లి తన పార్థివ దేహం పై పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి మండవ వేంకటేశ్వర రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, కోనేరు కొనప్పతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం చాలా బాధాకరమన్నారు.
తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈనాడు దినపత్రిక ద్వారా తన కలంతో ఒక సమాజాన్ని ప్రభావితం చేసిన ఆయన లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిదన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.