- అరుదైన ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తజనం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడాలో అరుదైన, అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. పోచమ్మతల్లి అమ్మవారు తాము సమర్పించిన పాలు తాగుతుండడంపై భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అమ్మవారి దర్శన భాగ్యం ఈ విధంగా కలగడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. మదీనాగూడా గ్రామంలోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది.
స్వయంభువుగా వెలసిన పోచమ్మతల్లి అమ్మవారికి ఇక్కడి స్థానికులు నిత్యపూజలు చేస్తారు. అయితే గత మూడు రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం ఆలయ కమిటీ వారికి తెలుపగా శుక్రవారం ఉదయం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు.
అమ్మవారు పాలను స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి దేవాలయానికి బారులు తీరారు. ఉదయం నుండి అమ్మవారికి భక్తులు పాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తూ పూజలు చేస్తున్నారు.