లారీల్లో డీజిల్ దొంగిలిస్తున్న వ్య‌క్తుల అరెస్టు

  • రూ.1.78 ల‌క్ష‌ల విలువైన సొత్తు స్వాధీనం
  • రెండు కార్ల సీజ్‌, పోలీసులు అదుపులో న‌లుగురు
  • మ‌రో నిందితుడు ప‌రారీలో

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాత్రి పూట రహదారి పక్కన ఆగి ఉన్న లారీల్లో డ్రైవర్‌, క్లీనర్‌ లేని సమయం చూసి లారీల నుంచి డీజిల్‌ను తస్కరిస్తున్న ఓ ముఠాకు చెందిన నలుగురిని మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు పోలీసులు వివరాలను వెల్లడించారు.

నిందితుల‌ను చూపిస్తూ వారి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తుతో వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న పోలీసులు

అక్టోబర్‌ 22వ తేదీన ఎన్‌వీ కృష్ణ అనే వ్యక్తి మియాపూర్‌ వద్ద ఉన్న అడ్డా సమీపంలో తన లారీని పార్కింగ్‌ చేసి దసరా పండుగ కోసం తన సొంత ఊరికి వెళ్లాడు. కాగా అక్టోబర్‌ 31వ తేదీన తిరిగి వచ్చి చూడగా తన లారీ డీజిల్‌ ల్యాంక్‌ లాక్‌ పగలగొట్టబడి ఉందని గమనించాడు. అందులో నుంచి 200 లీటర్ల డీజిల్ ను ఎవరో దొంగిలించారని గుర్తించి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మియాపూర్‌లోని విశ్వనాథ్‌ గార్డెన్‌ సమీపంలో వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో వారు చేసిన నేరాలు బయటపడ్డాయి. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. వారి నుంచి రూ.1.50 లక్షల విలువైన 1.5 కేజీల వెండి, ఎల్‌ఈడీ టీవీ, ఎల్‌పీజీ గ్యాస్‌ స్టవ్‌ తోపాటు మొత్తం కలిపి రూ.1.78 లక్షల విలువ చేసే సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక ఫోర్డ్‌ ఐకాన్‌ కారు (ఏపీ09ఏవై0577), మారుతి సియాజ్‌ కారు (టీఎస్‌06యూవీ2724)లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. వీటితోపాటు ఇంటి తాళాలను పగలగొట్టేందుకు ఉపయోగించే గ్రీన్‌ కలర్‌ పైప్‌, రెండు ఖాళీ ప్లాస్టిక్‌ క్యాన్స్‌, ఒక ఐరన్‌ రాడ్‌, స్క్రూ డ్రైవర్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఆ ముఠాలోని వ్యక్తులను ఎ1 తిరుపతి, ఎ2 సభావత్‌ రాజ్‌ కుమార్‌ (21 ఏళ్లు, ఆటోడ్రైవర్‌, నడిగడ్డ తండా, మియాపూర్‌), ఎ3 పటియావత్‌ గోపాల్‌ (25 ఏళ్లు, క్యాబ్‌ డ్రైవర్‌, జేపీ నగర్‌, మియాపూర్‌), ఎ4 పటియావత్‌ శంకర్‌ (21 ఏళ్లు, ఆటో డ్రైవర్‌, జేపీ నగర్‌, మియాపూర్‌), ఎ5 కేతావత్‌ రాజ గోపాల్‌ (25 ఏళ్లు, ఆటో డ్రైవర్‌, గోపన్‌పల్లి)గా గుర్తించారు. వారిలో ఎ1గా ఉన్న తిరుపతి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వీరందరూ స్నేహితులని, సులభంగా డబ్బులు సంపాదించేందుకు లారీల్లో డీజిల్‌ దొంగతనాలు చేయడం మొదలు పెట్టారని తెలిపారు. రాత్రి పూట రహదారుల పక్కన పార్క్‌ చేసి ఉండే లారీల్లో డ్రైవర్‌, క్లీనర్‌ లేని సమయం చూసి డీజిల్‌ను దొంగిలించి అమ్ముకుంటారని అన్నారు. అలాగే తాళం వేసి ఉన్న ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి విలువైన వస్తువులను చోరీ చేస్తారని తెలిపారు. కాగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మియాపూర్‌ ఏసీపీతోపాటు మియాపూర్‌ ఎస్‌హెచ్‌వో ఎస్‌.వెంకటేష్‌, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేష్‌ గౌడ్‌, క్రైమ్‌ సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్స్‌ రాజశేఖర్‌, శ్రీకాంత్‌, కానిస్టేబుల్స్‌ బలరాం, ప్రతాప్‌ రెడ్డిలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అభినందించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here