నమస్తే శేరిలింగంపల్లి : భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సివి రామన్ అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కాలనీలో గౌతమ్ మోడల్ పాఠశాలలో విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ( సైన్స్ ఫెయిర్) ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గౌతమ్ మోడల్ పాఠశాల లో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన విద్యార్థులలో దాగున్న సృజనాత్మకతను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చేసిన సాంకేతిక , సాంస్కృతిక, పర్యావరణ ప్రాజెక్టులను తిలకించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు విద్యార్థులు సంవత్సరమంతా చేసిన పనిని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక చక్కటి వేదిక ఇదని తెలిపారు. ప్రదర్శనకు విచ్చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను చూసి ఆనందం వ్యక్తం పరిచారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, గంగాధర్, మల్లేష్, సుదర్శన్ రాజు పాల్గొన్నారు.