- 70 వరకూ పాల్గొన్న మహిళలు
నమస్తే శేరిలింగంపల్లి : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి జంటసర్కిళ్ళ పరిధిలోని 30 కాలనీలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ వద్ద నేడు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన తరువాత కొమిరిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయినరామస్వామి యాదవ్ మాట్లాడారు.
“ఆరోగ్యాన్ని, పారిశుధ్యాన్ని, విజ్ఞానాన్ని మేళవించే సనాతన సాంప్రదాయమే ఇంటి ముందు ముగ్గులు వేయడం” అని అన్నారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించడానికి, మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా భూదేవి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంగళంపల్లి వెంకట రాధ, శ్రీరామ చంద్ర మూర్తి, కుమారి, కార్యక్రమ ఆర్గనైజర్ తన్వీర్ బేగం పాల్గొన్నారు. ఈ పోటీలలో 70 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.