- ధర్నాలు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడిలతో వేడెక్కిన రాజకీయం
- ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
- స్థానిక నాయకుల జోక్యంతో ప్రజాప్రతినిధులకు తలనొప్పులు
నమస్తే శేరిలింగంపల్లి: వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 10 వేల రూపాయల నగదు పంపిణీ కార్యక్రమం రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతోంది. వరదసాయం అందించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ప్రణాళిక లోపం, నిజమైన బాధిత కుటుంబాల వివరాల సేకరణ, స్థానిక నాయకుల భాగస్వామ్యం తదితర అంశాలు గందరగోళానికి దారి తీశాయి. బాధిత కుటుంబాల గుర్తింపు విషయంలో ఆయా బస్తీలకు చెందిన అధికార పార్టీ నాయకుల జోక్యం వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. మొదట్లో వరద ముంపుకు గురైన కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం అనంతరం తీసుకున్న నిర్ణయాలతో ఇరకాటంలో పడింది. ఈ క్రమంలోనే తమకు వరద సహాయం అందలేదంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలకు చెందిన ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు.

నగదు పంపిణీలో ప్రణాళికా లోపం
వరద బాధితుల గుర్తింపు విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. బస్తీల్లోని కుటుంబాలకు మాత్రమే వరద సాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయంతో కాలనీల్లోని ముంపుకు గురైన బాదిత కుటుంబాల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి. నగదును పంపిణీ చేసేందుకు వచ్చిన జిహెచ్ఎంసి అధికారుల వెంట స్థానికుల నాయకులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. పలుచోట్ల రూ.10 వేలకు బదులు తక్కువ మొత్తాన్ని అందించారని, కొన్ని చోట్ల తమకు అనుకూల మైన వారికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా సొంత పార్టీ నేతల తీరు ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారింది. కాగా రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ తమ నాయకులతో నగదు పంపిణీ చేయించిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా
శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు శనివారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదుట స్థానిక మహిళలతో కలిసి ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిజమైన లబ్ధిదారులకు మేలు చేయకుండా వారి కుటుంబాలకు, కార్యకర్తలకు డబ్బులు పంచుకుంటున్నారని ఆరోపించారు. నిజంగా నష్టపోయిన కుటుంబాలకు సహాయం అందకుండా చేస్తున్నారని, జిహెచ్ఎంసి అధికారులు సైతం టీఆర్ఎస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ ,కేటీఆర్ లకు రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటె తెలంగాణ రైతాంగానికి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు సైతం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాదు ప్రజలకు డబ్బు ఆశ చూపించి ఓట్లు పొందాలన్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని టీఆరెస్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన సాయం అందని బాధితులు…
వివేకానందనగర్, ఆల్విన్కాలనీ డివిజన్లలోని పలు బస్తీలకు చెందిన మహిళలు పెద్దఎత్తున ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఇంటిని చుట్టుముట్టారు. తమకు తక్షణ వరద సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదసాయం పంపిణీ విషయంలో స్థానిక నాయకుల తీరుపై మండిపడ్డారు. బస్తీల్లోని అర్హులందరికి వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు. స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ అక్కడకు వచ్చిన బాధితుల పేర్లను నమోదు చేయించుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. బాధితులందరికి తక్షణ వరదసాయం అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు.

కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన వేముకుంట మహిళలు
చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటకు చెందిన మహిళలు సైతం ఆందోళన బాట పట్టారు. విద్యనగర్ లోని స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఇంటిని వారు ముట్టడించారు. తక్షణ వరద సహాయం రూ.10 వేల పంపిణీ న్యాయంగా జరగలేదని ఆరోపించారు. బస్తీలోని కొందరికి మాత్రమే డబ్బులు పంపిణీ చేసి తమను ఎలా వదిలేస్తారని మండిపడ్డారు. కార్పొరేటర్ నవత రెడ్డి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బ విజయ్ రెడ్డి మహిళలకు నచ్చజెపె ప్రయత్నం చేయగా ససేమిరా అంటు పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. తమకు డబ్బులు ఇచ్చేంతవరకు వదిలేది లేదని మొండి పట్టుపట్టారు. దీంతో సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు రంగంలోకి దిగారు. డీఐ నర్సింగ్ రావు, ఎస్ఐ శ్యాంప్రసాద్ నేతృత్వంలో పోలీసులు సర్ధిచెప్పగా మూడు గంటలపాటు కొనసాగిన ఆందోళనను విరమించుకున్నారు.






