- బోట్స్ వానాలో ఘనంగా ప్రారంభమైన చిగురుమళ్ళ శ్రీనివాస్ వంద దేశాల శాంతి సద్భావన ప్రపంచ యాత్ర
- ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ లో హై కమిషనర్ భరత్ కుమార్ కూతాటి, నగర మేయర్ అబ్రహాం ఆస్టిన్ చేతుల మీదుగా ప్రారంభం
- వీడియో సందేశం ద్వారా పాల్గొన్న బోట్స్ వానా లోకల్ గవర్నమెంట్, రూరల్ డెవలప్మెంట్ మంత్రులు మాబ్యూస్ పూలే
- సాహిత్య చరిత్రలో అపూర్వ ఘట్టటమిది : తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్, వందేవిశ్వమాతరమ్ చైర్మన్ తాళ్ళూరి జయశేఖర్
- పెద్ద సంఖ్యలో హాజరైన బోట్స్ వానా అధికార అనధికార ప్రముఖులు
- బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ
- శాంతి సధ్భావన యాత్రకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక కార్యవర్గం
నమస్తే శేరిలింగంపల్లి: వందేవిశ్వమాతరమ్ పేరుతో శత శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ చేపట్టిన 100 దేశాల శాంతి సద్భావన ప్రపంచ యాత్ర ప్రారంభ సభ ఘనంగా ప్రారంభమైంది. ఆఫ్రికాలోని బోట్స్ వానాలోని ఇండియన్ హై కమిషన్ ఆఫీసులో జరగటం విశేషం. ఈ యాత్రకు తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక జాతీయ అధ్యక్షులు పిఆర్ఎస్ఎస్ఎన్ మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి, వందే విశ్వ మాతరమ్ సమన్వయకర్త మోటూరి నారాయణరావు, వందే విశ్వ మాతరమ్ సమన్వయకర్త డాక్టర్ ఆలపాటి శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 100 దేశాల్లోని 100 తెలుగు సంఘాల సారధ్యంలో సాగుతున్న ఈ యాత్ర తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానాపూర్వ అధ్యక్షులు వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి, బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇందులో బండ్ల హనుమయ్య, జంపాల చౌదరి, డా. తోట కూర ప్రసాద్, శ్రీనాథ్ కుర్రా, శిరీష తూనుగుంట్ల, లక్ష్మి దేవినేని, అశోక్ కొల్లా, వెంకట్ తరిగోపుల, సుమంత్ రామ్ శెట్టి, మురళి తాళ్ళూరి, మనోరమ గొంది తదితరులు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు100 దేశాల్లో సాగుతుందని ఈ యాత్ర సాగుతుంది. యాత్ర ప్రారంభసభలో వీడియో సందేశం ద్వారా తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తెలుగు వెలుగులు వెదజల్లుతూ విశ్వశాంతి, సౌభ్రాతృత్వాల కోసం చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల ప్రపంచ యాత్ర చేపట్టడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా తానా నిర్వహిస్తుందని, దీని ముగింపు సభ 2025లో అమెరికాలో జరిగే తానా మహాసభలలో సమాప్తం అవుతుందన్నారు. వందేవిశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ తెలుగు సాహిత్యం ద్వారా విశ్వశాంతి సందేశం ఇస్తూ, మానవ సమాజాన్ని చైతన్యాన్ని కలిగించే ఈ బృహత్ కార్యక్రమం సమాజంలో కొంతైనా మార్పు తీసుకువస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా భావితరాలలో మానవీయ విలువలను ప్రబోధిస్తుందని అన్నారు.
ప్రారంభసభకు బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వరరావు సభా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇండియన్ హై కమిషనర్ భరత్ కుమార్ కూతాటి మాట్లాడుతూ ఈనాడు ప్రపంచశాంతి, సౌభ్రాతృత్వాలు ఎంతో అవసరం. సాహిత్యం ద్వారా మానవాళికి మహా సందేశాన్ని ఇవ్వటానికి 100 దేశాల ప్రపంచ యాత్ర చేస్తున్న చిగురుమళ్ళ అభినందనీయులు, తానాకి, ఇతర తెలుగు సంఘాలకి, బోట్స్ వానా తెలుగు సంఘం వారికి అభినందనలు తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన గాబరాన్ మేయర్ అబ్రహాం ఆస్టిన్ మాట్లాడుతూ ఇటువంటి గొప్ప సంఘటన మా నగరంలో జరగటం తమ అదృష్టం అన్నారు. బోట్స్ వానా లోకల్ గవర్నమెంట్, రూరల్ డెవలప్మెంట్ మంత్రివర్యులు మాబ్యూస్ పూలే వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ అసాధారణం ఈ యాత్ర, అనితర సాధ్యం ఈ యాత్ర ఇది ఈనాడు అవసరమైన యాత్ర అన్నారు. మనుషులలో ఉన్న అశాంతిని ఆందోళనను తొలగించటానికి సాహిత్యం ఒక బలమైన ఆయుధమని సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం కలిగించటానికి పూనుకున్న కవికి, తానా కి , తెలుగు సంఘాలకు అభినందనలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆఫ్రికా దేశస్థులతో, పాటు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు.