– శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో 23 వేల బాధిత కుటుంబాల గుర్తింపు
– అర్హులందరికి సహాయం అందుతుందని ఉపకమిషనర్ల భరోసా
– స్థానిక నాయకుల చేతివాటంపై ప్రతిపక్షాల ఆరోపణలు
– సహాయం అందని బాధితులతో అక్కడక్కడ ఆందోళనలు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10 వేల తక్షణ ఆర్ధిక సాయం ప్రకటించిన విషయం విదితమే. మొదట్లో ఇంట్లోకి వరదనీరు చేరి ఇబ్బందులకు గురైన వారికి మాత్రమే సహాయం అందించాలకున్న సర్కారు ఆతర్వాత వరదల వల్ల పరోక్షంగా నష్టపోయిన వారికి సైతం రూ.10 వేలు చెల్లించాలనుకుంది. ఆపత్కాల వేళ ఇంత పెద్ద మొత్తంలో నేరుగ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ప్రజల నుంచి విశేష మద్ధతు లభించింది. బాదితులు ఎంతమంది ఉన్నా సహాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికి స్థానికంగా పలువురు నాయకుల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు విమర్శలకు దారితీస్తున్నాయి.

శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో 58 బస్తీల గుర్తింపు
శేరిలింగంపల్లి సర్కిల్‌లో 26 బస్తీల్లో 11 వేల వరద బాదిత కుటుంబాలను గుర్తించినట్టు ఉపకమిషనర్ తేజావత్ వెంకన్న, చందానగర్ సర్కిల్‌లో 32 బస్తీల్లో దాదాపు 12 వేల కుటుంబాలను గుర్తించినట్టు ఉపకమిషనర్ సుధాంశ్ నందగిరిలు నమస్తే శేరిలింగంపల్లికి వివరించారు. సదరు కుటుంబాలకు వరదసాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నామని, జంట సర్కిళ్లకు చెందిన వివిధ విభాగాల అధికారులను అదే పనిలో భాగస్వామ్యులను చేశామన్నారు. అర్హులందరికి వరదసహాయం అందుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇస్తున్నారు. ఐతే వరదసహయం పంపిణీకి వెళ్లిన సిబ్బందిచే స్థానిక అధికార పార్టీ నాయకులు తమకు అనూకూల మైన వారికి మాత్రమే డబ్బులను పంపిణీ చేయిస్తున్నారని, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వరదసాయం పంపిణీ పేరుతో ఆధికార పార్టీ లబ్ధిపొందాలని చూస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల సహాయం అందని బాధితులతో కలసి ఆందోళనకు సైతం దిగుతున్నారు.
రోడ్డెక్కిన ఆర్‌పీ కాలనీ వాసులు
వివేకానందనగర్ డివిజన్ ఆర్‌పీ కాలనీలో తమకు వరదసాయం అందలేదని స్థానికులు రోడ్డెక్కారు. వారికి బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. స్థానిక బిజెపి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అనుచరులకు మాత్రమే పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారని, నిజంగా ముంపుకుగురైన బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు సర్వే నిర్వహించి నిజమైన అర్హులకు రూ.10 వేలు అందజేసేలా చూడాలని, లేనియెడల ఎంతటి పోరాటానికైనా సిద్దమని హెచ్చరించారు.

ఆందోళనకు దిగిన వేముకుంట మహిళలు
చందానగర్ డివిజన్ వేముకుంట బస్తీ మహిళలు తమకు వరద సహాయం అందలేందంటు ఆందోళన బాట పట్టారు. బస్తీనుంచి చందానగర్ సర్కిల్ కార్యాలయానికి ర్యాలీగా తరలి వెళ్లారు. సర్కిల్ కార్యాలయం వద్ద దర్నా చేసేందుకు ప్రయత్నించగా చందానగర్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అర్హులైన వారందరికి వరద సహాయం అందుతుందని జీహెచ్ఎంసీ అధికారులు నచ్చచెప్పడంతో వారంత అక్కడి నుండి వెనుదిరిగారు.

వార్డు కార్యాలయంలో బైటాయించిన హఫీజ్‌పేట్ వాసులు
హపీజ్‌పేట్ డివిజన్‌లోను స్థానికులు ఆందోళనకు దిగారు. యూత్‌కాలనీ, హఫీజ్‌పేట్ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు తమ వీధుల్లో కొందరికి మాత్రమే డబ్బులు పంపిణీ చేసి మిగిలిన వారిని వదిలేసారని ఆరోపిస్తు స్థానిక వార్డు కార్యాలయంలో బైటాయించారు. వారికి స్థానిక బిజెపి నాయకుడు బోయిని మహేష్ యాదవ్ మద్దతు తెలిపారు. నిజమైన అర్హులను పక్కనబెట్టి తమకు అనుకూలమైన వారికి అధికార పార్టీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పంపిణీ చేసే డబ్బులు టీఆర్ఎస్ నాయకులు తమ జేబుల్లోంచి ఇస్తున్నట్టు ఫోటోలకు ఫోజులివ్వడం సిగ్గుచేటన్నారు.

కేటీఆర్‌కు లేఖ పంపిన వెంకట్‌రెడ్డి కాలనీ వాసి
శేరిలింగంపల్లి డివిజన్ వెంకట్‌రెడ్డి కాలనీలో నివాసం ఉండే లక్ష్మన్ రావు తమకు వరద సాయం అందలేదంటూ మంత్రీ కేటీఆర్‌కు సందేశం పంపించారు. ఇటీవలి వరదలకు తమ కాలనీ మొత్తం అతలాకుతలం అయ్యిందని, వరద ఉదృతికి తమ ప్రహరీ కూలిందని సూచిస్తూ సదరు ఫోటోలను సైతం పంపించారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం జరగలేదని, ఓ మిడియా సంస్థలో పనిచేస్తున్న తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల దుస్థితి ఎంటో అర్ధం చేసుకుని నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.







Good news keep going