- ఆ తర్వాత కంటికి రెప్పలా కాపాడుకుంటాం
- 50 రోజుల ప్రణాళికపై బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ తమ పార్టీ కార్యకర్తలకు దిశా, దశ నిర్దేశించారు. మసీదు బండ కొండాపూర్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ సమక్షంలో రవి కుమార్ యాదవ్ అధ్యక్షతన 50 రోజుల ప్రణాళికపై కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు హాజరై మాట్లాడారు.
బిజెపి పార్టీ తరఫు నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ కు టికెట్ వచ్చినట్లయితే అహర్నిశలు కష్టపడి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో ఉండే కార్యకర్తలను గుర్తించడం, వారి పేర్లు ఫోన్ నెంబర్, ఓటర్ ఐడి తీసుకోవడం, డివిజన్ల వారిగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, అక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి రోజూ బూత్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఇంటింటికి తిరుగుతూ బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేయాలని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ యాక్టివ్ గా పనిచేయాలని, డివిజన్ల వారీగా వాట్సప్ గ్రూప్స్ తయారుచేసి చేసే ప్రతి కార్యక్రమాన్ని తమ తమ గ్రూప్ లలో పోస్ట్ చేసి ఎక్కువ మందికి తెలిసే విధంగా ప్రచారాన్ని కొనసాగించాలని కార్యకర్తలకు దిశా, దశ నిర్దేశించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ అవినీతిని , అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ కార్పొరేటర్ల అక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం పై పూర్తి నమ్మకం తమకున్నదని, మొదటి లిస్టులో మన పేరు ఖరారు అవుతుందని కార్యకర్తలకు తీపి కబురు చెప్పారు. పార్టీ కోసం , మన కోసం 50 రోజుల సమయం కేటాయిస్తే.. వచ్చే ఐదు సంవత్సరాలు తాను అండదండగా ఉంటానని రవి కుమార్ యాదవ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా ఎవరైతే తమ తమ బూతుల్లో ఎక్కువ ఓట్లు సంపాదించినట్లయితే వారికి మొదటి బహుమతిగా రూ. 5 లక్షల నగదు బహుమతులు, రెండో బహుమతిగా మూడు లక్షల రూపాయలను అందజేస్తామని కార్యకర్తలకు హామీ ఇస్తూ వారిని ఉత్సాహపరిచారు . ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, మహిళా మోర్చా, యువ మోర్చా , దళిత మోర్చా , ఓబిసి మోర్చా, ఎస్టి మోర్చా మొదలగు వారు పాల్గొన్నారు,