చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ షిర్డీ సాయిబాబా, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేష్వరాలయ సముదాయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎడవరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా చండీహోమం నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవిని దర్శించుకని చండీహోమంలో భాగస్వామ్యులయ్యారు.

చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శుక్రవారం శ్రీ దుర్గాదేవి అవతారంలో పూజలందుకున్నారు. స్థానిక భక్తులు దివ్య, హరిత, వెంకటలక్ష్మినారాయణ, రూపచౌదరి, గీతమ్మ, ఉమా నిరంజన్‌లు వివిధ సేవల్లో భాగస్వాములయ్యారు. కాగా శనివారం మహార్ణవమి సందర్భంగా శ్రీ చంఢీహోమం జరుగుతుందని, 11 గంటలకు నవరాత్రుల్లో అమ్మవారికి అలంకరించిన చీరల వేలంపాట కొనసాగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.







