- పాత నేరస్తుడు అరెస్ట్, పల్సర్ బైక్, పుస్తెల తాడు, నగదు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి
నమస్తే శేరిలింగంపల్లి: మహిళ మెడలో పుస్తెల తాడును దొంగలించిన పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఏడీసీపీ నంద్యాల నరసింహా రెడ్డి, మియాపూర్ ఏసీపీ నరసింహా రావు, చందానగర్ సీఐ క్యాస్ట్రో, డీఐ పాలవెల్లితో కలిసి మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. బీదర్ కు సంగమేశ్వర్ (22) అలియాస్ హర్షిత్ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడటంతో సులువుగా నగదు సంపాదించడం కోసం దొంగతనాలు పాల్పడ్డాడు. ఫలితంగా పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే క్రమంలో 23న రాత్రి 9.54 నిమిషాల సమయంలో చందానగర్ పీజేఆర్ స్టేడియం నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వైపు ఓ మహిళా (శ్యామల కుమారి) ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నది. అదే సమయంలో పల్సర్ బైక్ మీద వచ్చిన సంగమేశ్వర్ ఆమె మేడలో పుస్తెల తాడును తెంపుకుని పారిపోయాడు. బాధిత మహిళ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా సంగారెడ్డిలో నిందితుడి పట్టుకుని అతడి వద్ద నుండి 4 తులాల పుస్తెల తాడు, ఒక పల్సర్ బైక్, ఒక సెల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు.