కోకాపేట్ లో స్థలం మారిస్తే సహించం: ఉప్పరి శేఖర్ సగర

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): నిర్మాణ రంగం పై ఆధారపడి రోజు కూలీలుగా జీవనం సాగిస్తున్న సగరుల జీవితాలలో వెలుగులు నిండాలంటే ప్రభుత్వాలు తమ డిమాండ్లను నెరవేర్చాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. ఆత్మ గౌరవ భవనం కోసం ముందుగా కేటాయించిన స్థలాన్ని మార్చితే ఆందోళన తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం గచ్చిబౌలి లోని టీఎన్జీఓస్ కాలని లో నూతన ఏర్పాటైన సగర సంఘం నాయకుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి శేఖర్ సగర ముఖ్యఅథితిగా హాజరయ్యారు. నూతన సంఘం సభ్యులను ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం సగర జాతికి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేట్ లో 2 ఎకరాల భూమిని మంజూరు చేసిందని, మొదట ఇచ్చిన స్థలాన్ని మార్చి అన్యాయం చేయాలని ప్రభుత్వంలోని కొందరు అధికారులు కుట్రలు చేసి లే-అవుట్ మార్చారని అన్నారు. మొదలు ఇచ్చిన స్థలాన్ని మార్చి నిర్ణయం కొనసాగిస్తే తమ కులాన్ని అవమానించినట్లే నని ఆయన అన్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగం పై ఆధారపడి రోజు కూలీలుగా పని చేస్తున్న సగరుల జీవితాలు బాగుపడాలంటే ఫెడరేషన్ లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో ఇఎండీలు మినహాయించి 50 శాతం పనులను సగరులకు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయాలని అన్నారు. స్థానిక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ సగర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, మాజీ అద్యక్షులు బంగారు నరసింహ సగర, రాష్ట్ర యువజన సంఘం అద్యక్షులు సతీష్ సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆంజనేయులు సగర, టీఎన్జీఓస్ కాలనీ సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సగర, కోశాధికారి చంద్రమౌళి సగర, సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.





