నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి దీప్తి శ్రీ నగర్ కాలనీలో గల రేగుల కుంటను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సందర్శించారు. రేగుల కుంటలో చేపలు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకుని మత్స్యకారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చెరువులోని దాదాపు నాలుగు లక్షల చేపలు మృతి చెందడం బాదాకరమని అన్నారు. చేపల పెంపకం ఆధారంగా చాలా మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని, చేపల మృతితో వారి కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల మృతి వలన కలిగిన నష్టాన్ని అంచనా వేసి అధికారులతో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని, మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, చందానగర్ మున్సిపల్ కమిషనర్ సుధాంశ్, ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తిక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.