నమస్తే శేరిలింగంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేసి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారులకు సూచించారు. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను తెలుసుకునేందుకు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వర్షాకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మాన్ సున్, ఎమర్జెన్సీ టీమ్స్ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. కాలనీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరూ కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శివప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రఘు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.