నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని నల్లగండ్ల కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. కూరగాయల మార్కెట్లోని దుకాణదారులు, చిరు వ్యాపారులు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను కార్పొరేటర్ కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కూరగాయల మార్కెట్ లోని సమస్యలపై సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్ లో ప్రహరీ గోడ, షెడ్ల నిర్మాణం, అంతర్గత మురికి కాలువలు, ఇతర మరమ్మత్తు పనులు వీలైనంత త్వరగా చేయిస్తానని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ఈఈ శ్రీనివాస్, మార్కెట్ వ్యాపారస్తులు, దుకాణదారులు, తదితరులు పాల్గొన్నారు.






