నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్త, మాదాపూర్, హఫీజ్ పేట్ కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం ణ జాతర ఘనంగా నిర్వహించారు. పూజితజగదీశ్వర్ గౌడ్ దంపతులు స్వామి వారి కళ్యాణాన్ని కన్నులపండువగా జరిపించారు.
స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మెడికల్ చైర్మన్ కృష్ణ మూర్తి, తెలంగాణ టూరిజాం చైర్మన్ శ్రీనివాస్ గుప్త, మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో ఒగ్గు కళాకారులు, పోతురాజుల విన్యాసాలతో పూజితజగదీశ్వర్ గౌడ్ దంపతులు, భక్తులు స్వామి వారికి బోనాలు సమర్పించారు. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో పోతురాజులు, పలువురు భక్తులు నడిచి తమ భక్తిని చాటుకున్నారు. నల్లగండ్ల, అపర్ణ టవర్స్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసింది.
..