నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట్ వడ్డెర బస్తీలో నూతనంగా చేపట్టిన మంజీర మంచినీటి పైపులైన్ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు. గుట్టల బేగంపేట్ లో చేపట్టిన పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బస్తీ లో అనారోగ్యానికి గురైన బాధితులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యానికి గురైన కారణాలను అన్ని కోణాలలో పరిశీలిస్తున్నామని, రెండు, మూడు విభాగాల నిపుణులతో మంచి నీటి శాంపిల్స్ 40 వరకు సేకరించి పరిశీలించనున్నట్లు చెప్పారుమ అస్వస్థతకు గురైన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు కృషి చేస్తున్నారని అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. మంచినీటి పైపులైన్ పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వడ్డెర బస్తీ నాయకులు సంబయ్య, ఓ.కృష్ణ, సెల్వరాజ్, షేక్ ఖాజా, సుబ్రమణ్యం, శ్రీనివాస్, వీరేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.