వృద్ధుని హత్యను ఛేదించిన పోలీసులు – నిందితుడు అరెస్టు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ రోడ్డు పక్కన కూలర్ షాప్ లో ఇటీవల జరిగిన వృద్ధుని హత్యను చందానగర్ పోలీసులు ఛేదించారు. హత్య చేసిన యువకున్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తాన్ పూర్ కు చెందిన షేక్ దస్తగిరి అనే యువకుడు హఫీజ్ పేట్ లోని ఆదిత్య నగర్ లో కూలీ పనిచేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. దస్తగిరి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మద్యానికి బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. తన సంపాదన విలాసవంతమైన అవసరాలకు సరిపోకపోవడంతో సెల్ ఫోన్లు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. రామచంద్రాపురం పీఎస్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడి ఈ‌ నెల 4 వ తేదీన అతివేగంతో నిర్లక్యంగా బైక్‌పై వెళ్లి పాదచారులను ఢీకొట్టడంతో మియాపూర్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 5వ తేదీన నిందితుడు దస్తగిరి దొంగిలించిన బైక్‌తో మత్తులో చందానగర్ రోడ్డు పక్కన గల కూలర్ షాపుకు వెళ్లడంతో కూలర్ షాపులో పనిచేస్తున్న మహ్మద్ ఇబ్రహీం ఖాన్ దస్తగిరిని మందలించాడు. అవమానంగా భావించిన దస్తగిరి‌ ఇబ్రహీం పై పగ పెంచుకున్నాడు. ఈ నెల 6 వ తేదీన అర్ధరాత్రి కూలర్ షాపులో నిద్రిస్తున్న ఇబ్రహీం ఖాన్ (70)ని పక్కనే ఉన్న బండరాయితో తల మీద కొట్టి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. మియాపూర్ డివిజన్ ఏసీపీ ఎస్.కృష్ణ ప్రసాద్, చందానగర్ సీఐ కె. కాస్ట్రో, , ఎస్ ఐ లు పి.నాగేశ్వర్ రావు, జానకిరామ్, పోలీస్ సిబ్బంది ఎండి. సాదిక్ అలీ, ఎం.మాణిక్యం కృషితో నింధితున్ని పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుని వద్ద మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here