నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 91 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని అఖిల భారత బంజారా సేవ సంఘ్ రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ వాపోయారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలలో గిరిజన ఖాళీలను 2,399 మాత్రమే చూపడం గిరిజన నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేయడమేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 32 శాఖల్లో 22 వేలకు పైగా గిరిజన బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ శాఖలు నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 వేల గిరిజన బ్యాక్ లాగ్ పోస్టులను వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారన్నారు. ఉద్యోగాల భర్తీలో ఆంధ్ర పాలకులు మోసం చేశారని, ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ తో పాటు బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కేవలం 2399 ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం గిరిజన నిరుద్యోగులను తీవ్ర ఆందోళన, నిరాశకు గురిచేశారని వాపోయారు. గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేసేలా 13 వేల గిరిజన బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు.