నమస్తే శేరిలింగంపల్లి: కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడే అధికారులు అభివృద్ధి పనుల పర్యవేక్షించడం మానేశారని శేరిలింగంపల్లి సీపీఐ నాయకులు రామకృష్ణ వాపోయారు. హైటెక్ సిటీ కూత వేటు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీలో సీపీఐ నాయకులు పర్యటించారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డుపై మురికి నీరు ఏరులై పారుతుందని, రోడ్లను తవ్వి గుంతల మయం చేయడంతో మరో సమస్య ఉత్పన్నమవుతోందని కాలనీ వాసులు వాపోయారు. సీపీఐ నాయకులు రామకృష్ణ కాంట్రాక్టర్లు ఈ మధ్య కాలంలో నిర్మించిన మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. నాసిరకం పనులు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటూ బిల్లులు మంజూరు చేయడంపై సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. బస్తిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో సంబంధిత తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇజ్జత్ నగర్ శాఖ సీపీఐ పార్టీ కార్యదర్శి కె. కాసీం, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కె. వెంకట స్వామి, ఎస్. నరసమ్మ, ఎం. వెంకటేష్, ఎస్. కురుమూర్తి, ప్రేమ్ కుమార్, ప్రశాంత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.