శేరిలింగంపల్లిలో భారీ వృక్షం నరికివేత బాధ్యులకు రూ.25,000 జరిమానా…

  • నిబంధనలకు విరుద్ధంగా చెట్లు నరికితే చర్యలు తప్పవు: ఏఫ్ఎస్ఓ శ్రీకాంత్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో ఓ భారీ వృక్షం నరికివేత ఘటనలో బాధ్యులకు అటవీశాఖ అధికారులు రూ.25,000 జరిమానా విధించారు. శేరిలింగంపల్లి పాత మున్సిపాలిటి, స్థానిక కార్పొరేటర్ కార్యాలయం ప్రాంగణంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన భారీ వృక్షం ఇటీవల నరికివేతకు గురైన విషయం విదితమే. కాగా ఆ ఘటనపై పలు పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కార్పొరేటర్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఓ నివాసం యజమానురాలు సి.స్వరూపను భారీ వృక్షం నరికివేతకు బాధ్యులుగా గుర్తించినట్టు కొత్తగూడ సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ అత్తెల్లి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వృక్షాన్ని నరికించినందుకు గాను రూ.25 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు. అటవీ శాఖ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వృక్షాలను నరికివేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

జరిమానా మొత్తం రూ.25 వేలు అటవి శాఖకు చెల్లించిన చలాన్

ప్రమాదాన్ని అరికట్టేందుకే కొమ్మలు తొలగించాం…
వృక్షం లోపలి భాగం చెదలు పట్టడం, పుచ్చిపోవడం జరిగిందని, చెట్టు నెలకూలే పరిస్థితిలో ప్రమాదాన్ని అరికట్టేందుకే సంబంధిత అధికారుల సహకారంతోనే చెట్టు కొమ్మలు తొలగించడం జరిగిందని భాద్యురాలు స్వరూప తెలిపారు. కాగా వృక్షాన్ని మొదలు వరకు నరకడాన్ని ఫిర్యాదుదారులు తీవ్రంగా ఖండించారు. రూ.25 వేలు ఫైన్ చెల్లించినంత మాత్రాన భారీ వృక్షానికి పూర్వ వైభవాన్ని తీసుకురాలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నరికివేతకు గురైన వృక్షం ఇదే
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here