నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మహమ్మారి సోకిన చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, ఇలాంటి వారి కోసం ప్రత్యేక పోస్ట్ కోవిడ్ క్లీనిక్ ఎంతగానో ఉపయోగపడుతుందని మెడికవర్ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ చెప్పారు. కోవిడ్ వల్ల దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం మెడికవర్ ఆస్పత్రి వారు ప్రత్యేక పోస్ట్ కోవిడ్ క్లినిక్ ను ప్రారంభించారు. డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కరోనాతో జీవన విధానంలో పూర్తి మార్పు వచ్చిందన్నారు. మూడో వేవ్ ఓమిక్రాన్ ప్రభావం అంతగా లేనప్పటికి చాలామంది దీని బారిన పడుతున్నారని అన్నారు. జనసమూహం ఎక్కువ ఉండే ప్రదేశాల్లోనే కరోనా అతివేగంగా వ్యాపిస్తుందని చెప్పారు. పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్ మాట్లాడుతూ కోవిడ్ వచ్చిన చాలామందిలో దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయన్నారు. అలసట, నిద్రలేమి, వాసన, రుచి కోల్పోవడం, నిరంతరం దగ్గు, శ్వాస ఆడకపోవుట, ఛాతి నొప్పి, గుండె దడ, తల తిరగడం, డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారన్నారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డి మాట్లాడుతూ పోస్ట్ కోవిడ్ క్లినిక్ ప్రారంభించడం ద్వారా ఒకే చోట అన్ని సమస్యలు వివిధ డాక్టర్స్ ద్వారా పరిష్కరించబడతాయని చెప్పారు. దీని ద్వారా అన్ని సమస్యలకి ఒకే చోట పరిష్కారం దొరకడంతో సమయం, డబ్బులు ఆదా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.