నమస్తే శేరిలింగంపల్లి: వసంత పంచమిని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తీశ్రీ నగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో శనివారం వేకువజాము నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 4 గంటలకు శ్రీ జ్ఞాన సరస్వతీదేవికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు, అర్చనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ అర్చకులు వసంత పంచమిని పురస్కరించుకుని చిన్నారులకు మంత్రోచ్ఛరణల మధ్య సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వలన మంచి జ్ఞానవంతులు, విద్యావంతులుగా మారి భవిష్యత్తులో వృద్ధి చెందుతారని తల్లిదండ్రుల ప్రగాఢ విశ్వాసం అని ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి అన్నారు. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ దేవి అని, జ్ఞాన శక్తికి అధిష్టాన దేవత అయిన ఆ సరస్వతి దేవి ఆశీస్సులు, అనుగ్రహం అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్మ వారికి సహస్రనామార్చన, పల్లకిలో గ్రంథముల ఊరేగింపు, విద్యార్థుల సామూహిక ప్రార్థనలు, జ్ఞాన దీపాలంకరణ, రాజోపచారాలు, మహా హారతి, ప్రసాద పంపిణీ చేశారు. భక్తులు, చిన్నారులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది.