నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్తంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంభ్ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలను తలపించేలా మహిళలు రంగురంగుల ముగ్గులను వేయడం సంతోషకరమని అన్నారు. ముగ్గుల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఐదు ప్రోత్సాహక బహుమతులను రామస్వామి యాదవ్ అందజేశారు. జడ్జిలుగా టి. వరలక్ష్మి వ్యవహరించగా ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, సత్య వాణి, కృష్ణ వేణి, సుశీల,శివ రామకృష్ణ, పాలం శ్రీను, ఎమ్. యస్ రావు తదితరులు పాల్గొన్నారు.