నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ ఎయిడ్స్ డే ని పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిటిజన్ ఆస్పత్రి వైద్యులు డా. నజియా తలసమ్, విశ్రాంత డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ గురు ప్రకాష్ గడిగె హాజరయ్యారు. విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో హెచ్ ఐవి, ఎయిడ్స్ వ్యాధి ఒకటని, ఈ వ్యాధి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి వేలాది మంది మృతి చెందుతున్నారని అన్నారు. హెచ్ఐవి సోకిన 10, 15 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ గా రూపాంతరం చెందే వీలవతుందన్నారు. హెచ్ఐవి సోకిన వెంటనే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి, క్రమేణా ఎయిడ్స్ గా మారి, ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. తరచూ జ్వరం రావటం, నోటి పూత, చర్మ వ్యాధులు రావటం, నీరసంగా ఉండటం, నీళ్ల వీరోచనాలు అవటం, ఆకలి తగ్గటం, అలసట, గ్రంథుల వాపు, బరువు తగ్గటం లాంటివి ఏయిడ్స్ వ్యాధి లక్షణాలు అని అన్నారు. సురక్షితం కాని సంభోగంలో పాల్గొనటం, కలుషితరక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సీరంజలను, బ్లేడ్ లను ఉపయోగించటం వల్ల, బార్బర్ షాపులల్లో ఒకరు ఉపయోగించిన బ్లెడ్ లను ఉపయోగించటం వల్ల, సూదితో పచ్చ బొట్లు వేయించుకోవటం ద్వారా ఏయిడ్స్ వ్యాధికి కారణమవుతాయన్నారు వైద్య రంగంలో వచ్చిన పరిశోధన ఫలితాల వల్ల అనేక రకాల మందులు అందుబాటులోనికి వచ్చాయని, వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ, జీవన శైలిని మార్చుకోవాలన్నారు. ప్రపంచంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్థులు ఎక్కువ ఉన్న దేశాలలో మన భారతదేశం రెండవ స్థానంలో ఉందని అని అన్నారు. భారత దేశంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మీజోరాం, బీహార్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలలో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారని గణంకాలు తెలుపుతున్నాయని అన్నారు. భారతదేశంలో 1986లో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని తెలిపారు. మనల్ని మనం కాపాడుకుంటూ, ఎదుటివారిని కూడా ఈ వ్యాధి భారిన పడకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత అందరిపై ఉందన్నారు.మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, విలువలతో కూడిన జీవన విధానాన్ని సాగిస్తూ, నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానం, పీచు ఎక్కువగా కలిగిన ఆహారాన్ని తీసుకోవటం, పాలు, పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉన్నప్పుడే, జీవితంలో ఏదైనా సాధించగలుగుతామని తెలిపారు. ఎయిడ్స్ పేషెంట్లను ద్వేషించకండి, వారిని ప్రేమతో, వారి పట్ల దయ, ప్రేమ, జాలి చూపాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. నిఖిత్ అంజుమ్ అధ్యక్షత వహించగా వైస్ ప్రిన్సిపాల్ అరుణ భాయ్, కో ఆర్డినేటర్ కెపి సదయ్య కుమార్, మురళి కృష్ణ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.