నమస్తే శేరిలింగంపల్లి:జాతీయ ఐక్యత దినోత్సవాన్ని, మాజీ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం మియాపూర్ లోని మయూరి నగర్, శ్రీ రంగపురం వద్ద గల గ్రేస్ అనాథాశ్రమాల్లో వృద్ధులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపహారాన్ని అందజేశారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఇందిరాగాంధీ, సర్థార్ వల్లాభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. వల్లాభాయ్ చేసిన సేవలను రామస్వామి యాదవ్ ఈ సందర్భంగా కొనియాడారు. న్యాయవాదిగా, రైతు నాయకునిగా, స్వతంత్ర సమరయోధులుగా, కేంద్ర హోం మంత్రిగా, తొలి ఉప ప్రధానిగా, భారతదేశ సమగ్రతకు, సమైఖ్యతకు కృషి చేసిన నాయకులు సర్థార్ వల్లాభాయ్ అన్నారు. ఇందిరాగాంధీ కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా, అలీన దేశాల అధ్యక్షురాలిగా దేశ ప్రతిష్టతను ఇనుమడింపజేశారని అన్నారు. గరీబీ హటావో నినాదంతో రాజబల్లాలను రద్దు చేసి, బ్యాంకులను జాతీయకరణం చేసి దేశాభివృద్ధికి బంగారు బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహన్, శ్రీను, జనార్థన్, ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.