గాంధీ భ‌వ‌న్‌లో గాడ్సేలు దూరారు: కేటీఆర్ – హైటెక్స్‌లో టీఆర్ఎస్‌ ప్లీన‌రి ఏర్ప‌ట్ల ప‌రిశీల‌న‌

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా మాదాపూర్ హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమావేశం ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులందరికి, పార్టీ సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంచి పరిపాలనతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు, పాలనకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం తెలంగాణతో కలిసి పోవాలని డిమాండ్ చేస్తున్నారంటే అంటే తెలంగాణ పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. దశాబ్దాల తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసిందని, బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించామన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి గా తెలంగాణను తీర్చిదిద్దామని అన్నారు. అద్భుతమైన పరిపాలన సాగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని 20 ఏళ్ల ద్విదశాబ్ది సంబరాలలో భాగంగా హైదరాబాద్, మాదాపూర్ లోని హైటెక్స్ లో ప్లీనరీని పార్టీ నిర్వహించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. ప్లీనరీకి సుమారు ఆరు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు వస్తారని, పాల్గొనే ప్రతి ఒక్కరూ గులాబీ రంగు దుస్తులు ధరించి రావాల్సి ఉంటుందన్నారు. పాల్గొనేవారందరికి ఆహ్వాన పాసులు జారీ చేస్తామన్నారు. 25 న ఉదయం 10 గంటలకు ప్లీనరీ సమావేశం ప్రారంభం కానుందని, నియోజకవర్గాల వారిగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని 10.45 గంటల వరకు ప్లీనరీ ప్రాంగణంలోకి రావాల్సి ఉంటుందని చెప్పారు. ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఈ సమావేశంలో 7 తీర్మాణాలు ప్రతిపాదించబడుతాయని, మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఉంటుందన్నారు. అనంతరం పార్టీ ప్లీనరీ సేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల…
కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో పోటీ చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఇది అవాస్తవమంటే అందుకు సంబంధించి సాక్ష్యాలను నేను బయట పెడతానని చెప్పారు. గతంలో ఏ విధంగా అయితే కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో చీకటి ఒప్పందం తో పోటీ చేశాయో అదేవిధంగా హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపికి ఓటు వేయమని ఎలా మాట్లాడుతారని, రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ లోపాయికారిగా ఎలా కలుస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఎన్ని లోపాయికారీ ఒప్పందాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా విజ్ఞులయిన హుజురాబాద్ ప్రజలు కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాణిక్యం ఠాకూర్ 50 కోట్ల రూపాయలకు పిసిసి పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదని, ఇప్పటిదాకా దానిపైన మాట్లాడలేదన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. గాంధీభవన్ లో గాడ్సేలు దూరారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ సైతం తన రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకంను ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని అన్నారు. ఇప్పుడు పక్క జిల్లాలకు మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తుందేమో అనిపిస్తుందని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి మల్లా రెడ్డి, కమిటీ సభ్యులు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, శంభిపుర్ రాజు, బండి రమేష్, టీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు నార్నే శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేటీఆర్, కమిటీ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here