- అంగరంగ వైభవంగా హరిహరుల వైభవోత్సవాలు ప్రారంభం
చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హరిహరుల వైభవోత్సవాలను పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి బుధవారం ప్రారంభించారు. ఉత్సవాల్లో పాల్గొనే పండిత, ప్రముఖులకు దీక్షా వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ యాదాద్రి ఆలయానికి బంగారు తొడుగు చేయించాలన్న కేసీఆర్ సంకల్పానికి ముందే, చందానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయడం తెలంగాణకు శుభసూచకమని అన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత చందానగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవములు ఈ నెల 24వరకు వైభవంగా జరగనున్నట్లు తెలిపారు.
విశాఖ శారదా పీఠం ఉత్తరపీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ శ్రీ శారదాపీఠానికి తెలంగాణ రాష్ట్రంపై ఎంతో మక్కువ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో చందానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రజతోత్సవాలను పురస్కరించుకుని హరిహరుల వైభవోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలలో చండీహోమం, రుద్రహోమం చేపట్టడం జరిగిందని, శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చన ఉంటుందని వివరించారు.
కొంతకాలంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఉత్తరాదిలోనే ఎక్కువ కాలం గడిపారని, సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు కె. రఘుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి తూడి సుభాష్, తోట సుబ్బారాయుడు, కలిదిండి సత్యనారాయణ రాజు, బి. శ్రీనివాస రావు, కె. బాపిరాజు, సుదర్శనం సాయి శ్రీకర్, చుట్టు పక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.