గుండె జబ్బులపై అవగాహన ఉండాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మానసికంగా ఆనందంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాపిరెడ్డి కాలనీలోని దేవనూరి హాస్పిటల్ (డిమ్స్) లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దేవనూరి కొమురయ్య ఏర్పాటు చేసిన ఉచిత గుండె జబ్బుల శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బిజీ సమయంలో లేనిపోని మానసిక ఒత్తిళ్లకు గురవుతూ గుండె‌ జబ్బుల‌ భారిన పడి మృతి చెందుతున్న సంఘటనలు అధికమవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె జబ్బులపై అవగాహన‌ కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. దేశంలో హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని, వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, వ్యాయామం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయని అన్నారు. శరీరంలో రక్తప్రసరణతోపాటు మరెన్నో ప్రధాన బాధ్యతలను నిర్వర్తించే గుండెను పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉంచాలంటే సమతులహారం తీసుకోవాలని రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా చూసుకోవాలని, తగినంత నిద్ర అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార భాషా సలహా సంఘం సభ్యులు మిరియాల రాఘవ రావు, శ్రీకళ, డిమ్స్ హాస్పిటల్ మెంబర్లు, డాక్టర్ దేవనూరి అక్షయ కుమార్, డాక్టర్ దేవనూరి మాలత, డాక్టర్ దేవనూరి మానస ప్రియ, కాంటినెంటల్ హాస్పిటల్, సీఎస్వీ ఫౌండేషన్ మెంబర్లు పాల్గొన్నారు.

గుండె జబ్బుపై అవగాహన కల్పిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here