- క్రీడా దినోత్సవ వేళ సింధు పేరిట ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ
నమస్తే శేరిలింగంపల్లి: ఒలంపిక్స్ లో వరుసగా రెండుసార్లు పతకాలు సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని తెలంగాణ పోస్టల్ సర్కిల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్ అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా టోక్యో ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన పి.వి.సింధు పేరిట ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజేంద్రకుమార్ మాట్లాడుతూ వరుసగా రెండవసారి ఒలంపిక్స్ లో పతకం సాధించిన పి.వి.సింధు దేశంలోని యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. క్రీడాకారులకు మరింత స్ఫూర్తినిచ్చేలా సింధు పేరిట తెలంగాణ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కవర్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. బ్యాడ్మింటన్‌లో భారతదేశం నుండి మొదటిసారిగి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత సింధుకే దక్కిందని తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని అభిలషించారు. అనంతరం పి.వి.సింధు మాట్లాడుతూ తన పేరిట పోస్టల్ శాఖ అధికారులు ప్రత్యేక కవర్‌ను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో మరింతగా రాణించి దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తానని ఆమె తెలిపారు. సింధు పేరిట రూపొందించిన కవర్‌లను ఖైరతాబాద్ పోస్టల్ కార్యాలయంలోగానీ, ఆన్‌లైన్ ద్వారాగానీ కొనుగోలు చేయవచ్చని పోస్టల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ అధికారులు కె.ఎ.దేవరాజ్, సాయిపల్లవి, రిప్పన్ డుల్లెట్ తదితరులు పాల్గొన్నారు.