– పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నవంబర్ 2న నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీహెచ్ఎంసీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్పొరేటర్లు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.

కేటీఆర్ అసంతృప్తి…
ఈ సమావేశంలో సిట్టింగ్ కార్పొరేటర్ల పని తీరుపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని. పని తీరు మార్చుకోవాలని ఆయన ఒకింత హెచ్చరించారు. సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.
సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో మాత్రమే కోతలు విధించామని, ఇతర రాష్ట్రాలకు చీరలను సప్లై చేసే స్థాయికి మన నేతన్నలు ఎదగడం గర్వకారణమన్నారు. చేనేతల కోసం వివిధ పథకాలు తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయన్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సమావేశంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు…
గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ తమ డివిజన్ల పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పలు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు విడివిడిగా వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, బొబ్బ నవత రెడ్డి, కొమిరిశెట్టి సాయిబాబా, హమీద్ పటేల్, పూజిత, జగదీశ్వర్ గౌడ్, జానకి రామరాజు, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.





